మెదక్ జిల్లాలో మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. జిల్లాలోని పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో పంట పొలాల్లో సాగు కోసం కొత్తగా బోరు ఏర్పాటు చేయగా.. సాయి వర్ధన్ అనే బాలుడు అందులో పడిపోయాడు. బోరు వేసిన అర గంటలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
మంగళి భిక్షపతి అనే వ్యక్తి తన పొలంలో బోరు వేయించాడు. అయితే, బోరు నుంచి నీళ్లు రాకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. బోరు వేసిన తర్వాత బాలుడి తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోరు వేసిన చోట కేసింగ్ వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బోరుబావిలో పడిన బాలుడు భిక్షపతి కుమారుడిగా గుర్తించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, పాపన్నపేట పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు, ఘటనా స్థలం వద్దకు కలెక్టర్, ఎస్పీ చందనా దీప్తి చేరుకున్నారు. బాలుడిని బయటకు తీసేందుకు చేపట్టిన సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com