అది ఫిబ్రవరి21 2013, సాయంత్రం 7గంటల సమయం. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్ దగ్గర ప్రజలు రద్దీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వారు ఉన్న సమయంలోనే వెంటవెంటనే జంటపేలుళ్లు జరిగాయి. వాళ్లలో కొంతమంది ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఆ ప్రాంతమంతా రక్తపు మడుగుతో చేతులు కాళ్లు తెగి విరిగిపడిన వారి ఆహాకారాలు ఆర్తనాదాలతో భీతిల్లిపోయింది. కొద్ది వ్యవధిలోనే రెండు చోట్ల బాంబులు పేలాయి.
ఈ ఘటనతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పూర్తిగా చీకటి పడక ముందే ఆ ప్రాంతం మారణహోమంలా మారింది. రెప్పపాటులో సంభవించిన పేలుళ్లుధాటికి ఒకరు కాదు ఇద్దరు కాదు 19మంది ప్రాణాలు విడిచారు. బాంబు అవశేషాలు తగిలి వందల మంది గాయపడ్డారు. సరిగ్గా ఏడేళ్ల క్రితం దిల్ సుఖ్ నగర్ లో దడ పుట్టించిన ఘటన ఇప్పటికీ హైదరాబాద్ వాసుల్ని వెంటాడుతూనే ఉంది.
ఈ కేసుపై చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసిన ఎన్ఐఎ మూడేళ్లపాటు విచారణ జరిపింది. 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. 502 డాక్యుమెంట్లు, 201 మెటీరియల్ ను పరిశీలించింది. నిందితులకు వ్యతిరేకంగా ఎన్ఐఎ పక్కా సాక్ష్యాధారాలు సమర్పించింది. ఎన్ఐఎ లాయర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. 2016 నవంబరు 7న వాదనలు పూర్తయ్యాయి. ఇండియన్ ముజాహిదినే పేలుళ్లకు పాల్పడినట్టు తేలింది.
నిందితులందరూ దోషులేనని 2016, డిసెంబర్ 13న ఎన్ఐఎ కోర్టు నిర్ధారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల దోషులకు ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్ లకు ఉరిశిక్ష విధుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నాడు. మిగతా నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.
నగర వాసుల్ని ప్రాణభయంతో వణికి పోయేలా చేసిన జంటపేలుళ్లు జరిగి సరిగ్గా ఇవ్వాల్టికి ఏడేళ్లు కావొస్తుంది. ఫిబ్రవరి 21 వచ్చిందంటే చాలు జంటపేలుళ్ల ఘటన గుర్తు చేసుకుంటూ ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com