ఒకటీ రియాల్టీ షో..మరొకటి రియల్ లైవ్ షో..ఒకటి 15 వారాల పాటు వినోదం పంచడానికి సిద్దం కాగా..మరొకటి రెండు నెలలపాటు ప్రేక్షకులను అలరించనుంది. ఆ రెండు మరేవో కాదు బిగ్ బాస్, ఐపీఎల్.. ఇంతవరకు బిగ్ బాస్, ఐపీఎల్ ఎప్పుడు కలిసి రాలేవు. కానీ కరోనా వాటిని కలిపింది. ఇప్పటికే బిగ్‌బాస్ ప్రసారమవుతుండగా, ఐపీఎల్ మరి కొన్ని రోజుల్లో ఆరంభం కానుంది. ఈ రెండూ సుదీర్ఘమైన షెడ్యూల్స్ కావడమే ఆయా యాజమాన్యాలను టెన్షన్ పెడుతోంది.
ఇప్పటివరకూ బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షోపై ఐపీఎల్ ప్రభావం పడలేదు. గత మూడు సీజన్లలో బిగ్‌బాస్ తెలుగు షో అనేది ఐపీఎల్‌కు ఎడంగానే ఉంటూ వచ్చింది. కానీ ఈసారి తెలుగు బిగ్‌బాస్‌పై ఐపీఎల్ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఈ రెండింటికి పెద్దగా కాల వ్యవధి లేకపోవడమే ఇందుకు కారణం. బిగ్‌బాస్-4 సీజన్ సెప్టెంబర్ 6 నుంచి ఆరంభం కాగా, ఐపీఎల్ ఈ నెల19నుంచే ఐపీఎల్ షురూ కానుంది. అంటే 13 రోజులే తేడా. ఈ రెండూ ఎంటెర్‌టైన్‌మెంట్ షోలు దాదాపు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉండటంతో వ్యూయర్‌షిప్ పరంగా బిగ్‌బాస్‌కు ఇది దెబ్బగానే చెప్పొచ్చు.
ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి జరుగుతాయి. లీగ్‌లో రెండేసి మ్యాచ్‌లు అనేది 10 రోజులే జరుగుతాయి. ఇక్కడ రెండో మ్యాచ్‌తోనే బిగ్‌బాస్ షోకు ఇబ్బంది. సాధారణంగా క్రికెట్‌కు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి, బిగ్‌బాస్ షో వ్యూయర్‌షిప్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సారి ఐపీఎల్-13 సీజన్ జరుగుతుందని తెలిసినప్పటికీ బిగ్‌బాస్ యాజమాన్యం సాహసించి నిర్ణయం తీసుకుంది.
ఒకవేళ ఐపీఎల్ అయిన తర్వాత బిగ్‌బాస్ షోను నిర్వహించాలంటే రెండు నెలలు ఆగాల్సి వస్తుందనే కారణంతోనే యాజమాన్యం చివరకు షోను నిర్వహించడానికే ముందడుగు వేసింది. ఒకరోజు అయిన షోను మళ్లీ రిపీట్ చేసే అవకాశం ఉండటమే బిగ్‌బాస్ ధైర్యం చేసి నిర్ణయం తీసుకోవడానికి కారణం కావొచ్చు. ఏది ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీవర్‌లో ఇప్పుడు సక్సెస్ ఫియర్ కూడా మొదలైందనడంలో ఎలాంటి సందేహం లేదు.