ఆపరేషన్ ఆకర్ష్ టాస్క్‌లో బీజేపీ సక్సెస్‌పుల్‌గా దూసుకెళ్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా సత్తాచాటిన కమలం.. ఇప్పుడు పక్క పార్టీల నేతలను ఎట్రాక్ట్ చేస్తూ కషాయం కండువా కప్పేస్తుంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హస్తానికి హ్యాండిచ్చి కమలానికి జై కొట్టారు.
కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఆయన గత కొంతం కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీలోని పదవులన్నింటికీ రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించి..అలా బీజేపీలో చేరారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయాధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.
2009 ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ అశించిన కూన శ్రీశైలానికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచే పార్టీ పట్ల కొంత అసంతృప్తితోనే ఉన్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అయితే, గత ఆరున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించలేకపోతోందని కూన ఆరోపించారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి బీజేపీనే సరైందనే భావనతో పార్టీ మారినట్టు శ్రీశైలం గౌడ్ చెప్పారు.
కూన శ్రీశైలం గౌడ్ ఇప్పటివరకూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల రేవంత్ నిర్వహించిన పాదయాత్రలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన కాంగ్రెస్‌ను వీడటం మేడ్చల్ జిలాల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు పార్టీలో రేవంత్ హవాకు కూడా కొంత దెబ్బేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నగర శివారు ప్రాంతాలకు చెందిన మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది
పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసినా.. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించడంలో అధిష్ఠానం చేస్తున్న జాప్యం, పార్టీలోని గ్రూపు
తగాదాలతో రోజురోజుకూ ప్రజల్లో పార్టీ ఆదరణ కోల్పోతోందన్న భావనలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడటమే మంచిదన్న భావనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా బీజేపీ కూడా నగరశివారులోని కీలక నేతలపై గురి పెట్టినట్లు, వారిని తమ గూటికి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికైన కాంగ్రెస్ తేరుకోకపోతే పార్టీ అదో:పాతాళానికి పరిమితం కావడం ఖాయంగా కన్పిస్తోంది.