ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి కీలక ఘట్టం రేపు మొదలుకానుంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు తొలి విడత, మిజోరంలో ఒకేసారి మొత్తం 40 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. హోరాహోరీగా సాగిన ప్రచారం నిన్న సాయంత్రమే ముగిసింది.
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లు ఉండగా.. నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతం సహా ఏడు జిల్లాల్లోని 20 సీట్లకు రేపు ఎన్నికలు నిర్వహిస్తారు. గత ఎన్నికల్లో ఈ 20 సీట్లలో కాంగ్రెస్ ఏకంగా 17 గెలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలతో పాటే ఛత్తీస్‌గఢ్‌లోనూ డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2003, 2008, 2013ల్లో వరుసగా మూడుసార్లు పరాజయం పాలైన కాంగ్రెస్.. గత ఎన్నికల్లో ఏకపక్షంగా 68 స్థానాల్లో విజయం సాధించింది.
ఇక ఈశాన్య రాష్ట్రం మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. మిజోరంలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ఎంఎన్ఎఫ్ ముమ్మర ప్రచారం చేసింది. గత ఐదేండ్లలో చేపట్టిన అభివృద్ధిని చెప్పుకోవడంతోపాటు శరణార్ధులు, ఇతర ప్రాంతాల నుంచి వలసల అంశాన్ని ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించింది.
మిజోరంలో ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందనే ప్రధాన ప్రచారాస్త్రంతో ముందుకెళ్లింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్పీఎం పార్టీ, ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉంది.