తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఈ రెండు సీట్లను ఎవరికి కేటాయిస్తారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెరో ఎమ్మెల్సీ సీటు దక్కేది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం రెండు సీట్లకు వేర్వేరుగా ఈ నెల 29న ఉప ఎన్నిక నిర్వహించాలని ప్రకటించింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీల పదవీకాలం 2027 నవంబర్ 30న ముగుస్తుంది. అయినప్పటికీ వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ స్పష్టం చేసింది.
ఇదే విషయంపై అసెంబ్లీ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి స్పష్టత కోరారు. CEC ఆదేశాలకు అనుగుణంగా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని సీఈవో వారికి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 11న (ఎల్లుండి) వేర్వేరు నోటిఫికేషన్ల విడుదలకు అసెంబ్లీ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.
ఉప ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుండడంతో రెండు సీట్లు 64 మంది ఎమ్మెల్యేలున్న అధికార కాంగ్రెస్ గెలుచుకోనుంది. దీంతో బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఎల్లుండిలోపే పోటీపై బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వనుంది.