ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. ఫలితాలు 3వ తేదీనే వచ్చినప్పటికీ ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లోనూ సీఎంలను బీజేపీ ప్రకటించలేదు. దీంతో ప్రధాన పార్టీలు బీజేపీని టార్గెట్ చేశాయి. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రధాన పార్టీల విమర్శలకు అమిత్ షా (Amit Shah) ఈ పోస్టు ద్వారా కౌంటర్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.
తన మనవరాళ్లతో కలిసి చెస్ (chess) ఆడుతున్న ఫొటోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘‘ఒక మంచి ఎత్తుగడతో ఆగిపోకండి. ఎప్పటికీ ఉత్తమమైన దాని కోసం చూడండి’’ అని షా రాసుకొచ్చారు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్ (Madhyapradesh)లో అధికారాన్ని నిలుపుకోవడమే కాకుండా రాజస్థాన్ (Rajasthan), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో ప్రత్యర్థి కాంగ్రెస్ (Congress)ను బీజేపీ ఓడించింది. ఇప్పటికే మూడు రాష్ట్రాలకు సీఎం ఎవరనేది నిర్ణయించడానికి బీజేపీ పరిశీలకులను నియమించింది. సోమవారం నాటికి సీఎంలను ప్రకటించే అవకాశం ఉంది.