సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాదు.. కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి సీఎం కేసీఆర్‌లో ఈ మార్పులకు అసలు కారణమేంటి.. అనేది అటు సొంత పార్టీ నేతలతో పాటు ఇటు రాష్ట్ర రాజకీయల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ఢిల్లీ వెళ్లి వచ్చాక ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఓసారి చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను ముందు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తమ పంటల ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని కొత్త వ్యవసాయ చట్టాలు చెబుతున్నాయని, అలాంటప్పుడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇక కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీతో కలిపి కేంద్ర పథకాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలిపారు. 2018లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అంగగీకరించలేదు.
ఇక తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే తెలంగాణలో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి 60 శాతానికి రిజర్వేషన్లు చేరాయి. రెండు రోజుల్లో అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. దేశంలో అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తెలంగాణలో మోక్షం రాబోతోంది. రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన 10% రిజర్వేషన్లను కేంద్రంతోపాటు పలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నా.. ఇక్కడ మాత్రం అమలుకు నోచుకోవడంలేదు.