దుబ్బాకలో ఉపఎన్నిక పోరు వాడీవేడీగా సాగనుంది. ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు ఖరారే కాలేదు కానీ ప్రచారం మాత్రం ప్రారంభమైంది. నవంబర్ లో ఉపఎన్నిక పోలింగ్ జరిగే అవకాశముంది. అయితే, ఎవరైనా ఎమ్మెల్యేలు మరణిస్తే వారి కుటుంబసభ్యులే ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీ చేయకపోవడం అనే ఆనవాయితీ ఉండేది. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. గత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్ రెడ్డి, కిష్టారెడ్డి మరణిస్తే ఉప ఎన్నికల్లో వారి కుటుంబసభ్యులే పోటీ చేసినా టీఆర్ఎస్ వారిపై పోటీ పెట్టి ఓడించింది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌పైన మిగతా పార్టీలు అభ్యర్థులను నిలుపనున్నాయి.
ఇప్పటికే దుబ్బాకలో తమ పార్టీ పోటీలో ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తాము కూడా పోటీ చేసేందుకు బీజేపీ కూడా నిర్ణయించింది. ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ఇప్పటి నుండే పార్టీలు దుబ్బాకపై నజర్ పెట్టాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దుబ్బాక నియోజకవర్గ బాధ్యతలను మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. అయితే ఉప న్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రామలింగారెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబీకుల్లో ఒకరికి టికెట్ ఇస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇంకొందరు నాయకులు మాత్రం సోలిపేట కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ నుండి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి బరిలోకి దిగే అవకాశం ఉంది. గతంలో మెదక్ ఎంపీగా వ్యవహరించిన విజయశాంతిని దుబ్బాక ఉప ఎన్నికల బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ తరపున విజయశాంతి బరిలోకి దిగితే.. దుబ్బాక ఉప ఎన్నిక పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు.
ఇక బీజేపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రఘునందన్ రావు మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతీరోజూ పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి పెరుగుతుందని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతారని, తనను గెలిపిస్తే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉంటానని ఆయన అంటున్నారు. మరోవైపు యాంకర్, బిగ్ బాస్ ఫేం కత్తి కార్తిక ఇండిపెండెంట్‌గా దుబ్బాక ఉప ఎన్నిక బరిలో దిగేందుకు సన్నద్ధం అవుతున్నారు. దుబ్బాకలో తిరుగుతూ, వివిధ సంఘాల నాయకులతో సమాలోచనలు చేస్తున్నారు.
ఏదీఏమైనా ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మల్చుకునేందుకు ఇంతకు మించిన వేదిక మరొకటి లేదని ప్రతిపక్షాలు భావిస్తుంటే ఇన్నాళ్లుగా తాము ఏం చేశామో చెప్పడానికి దీనికి మించిన అవకాశం మరొకటి రాదని గులాబీదళం అంచనా వేసుకుంటుంది. ఏకగ్రీవం అవుతుందేమోనన్న అనుమానం నుంచి త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాల వరకు దుబ్బాకలో ప్రతీ అడుగు రాజకీయమే కనిపిస్తోంది. అయితే అంతిమపోరులో విజేత ఎవరన్నది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే..