శివాజీ గొప్ప యోధుడేగాక అంతకుమించిన పాలనాధక్షుడు. ఈనాడు మనం సామ్యవాదం, సోషలిజం, లిబరలిజం, ప్రజాతంత్రం అనే మాటలను పదే పదే వింటుంటాము. శివాజీ పాలనలో ఇవి అన్ని సర్వసమావేశమై ఉండేవి. నేటి భాషలో చెప్పాలంటే గొప్ప సెక్యూలరిస్టు.
ఛత్రపతి శివాజీ..ఈ పేరు వినగానే ఓ వీర యోధుడు మనసులో మెదులుతాడు. ఆయన సాహసం..వీరత్వం, ధీరత్వం, సమయస్పూర్తి, యుద్ధతంత్రం మాటల్లో వర్ణించలేనిది..ఆయన గెరిల్లా యుద్ధతంత్రమైతే చరిత్రలో ఓ మరుపురాని ఘట్టం. మరాఠా చక్రవర్తులలో సుప్రసిద్ధుడైన ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి 19, 1630న జన్మించాడు. శివనేరి కోటలో షాహాజీ – జిజాబాయి దంపతులకు జన్మించాడు. తండ్రి షాహాజీ పూణేలో జాగీరుగా ఉండేవాడు. తల్లి శివాజీకి చిన్నప్పటినుండి భారత, రామాయణ గాధలు చెప్పి వీరలక్షణాలు మొలకింపజేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను క్షున్నంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధతంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు రచించాడు.
17 ఏళ్ల వయస్సులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజానికి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. మరో మూడేళ్లలో రాజ్ ఘట్ కోటలను వశపరుచుకుని పూణే ప్రాంతాన్నంత తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తన కోటలను సొంతం చేసుకోవడం చూసి అదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి షాహాజీని బంది చేస్తాడు. తర్వాత శివాజీని, ఆయన సోదరుడిని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని విడిపిస్తారు. అప్పుడు అదిల్షా యుద్ధ భయంకరుడిగా పేరుపొందిన అప్జల్ ఖాన్ ను శివాజీపైకి యుద్దానికి పంపుతాడు.
యుద్ధ భయంకరుడుగా పేరుపొందిన అఫ్జల్‌ఖాన్ శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకుని ఆయనను రెచ్చగొట్టేలా శివాజీకి ఇష్టదైవమైన భావానీదేవి ఆలయాన్ని కూల్చివేశాడు. అఫ్జల్ కుట్రలు తెలుసుకున్న శివాజీ ప్రతాప్‌ఘడ్ కోటలో సమావేశానికి అంగీకరిస్తాడు..ముందు జాగ్రత్తగా ఉక్కుకవచాన్ని ధరించి పిడిబాకును దాచుకుని చర్చలకు సిద్ధమవుతాడు. శివాజీని అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అఫ్జల్ కత్తితో శివాజీపై దాడి చేస్తాడు, ఉక్కుకవచం కారణంగా రక్షించబడిన శివాజీ వెంటనే అఫ్జల్ ఖాన్ పై దాడి చేసి చంపేస్తాడు. ప్రతాప్ ఘడ్ యుద్ధంతో శివాజీ కీర్తిప్రతిష్టలు భారతదేశమంతటా వ్యాపిస్తాయి. ఎందరో హిందూరాజులకు ఆయన ఆదర్శంగా నిలిచారు.
శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించి.. ప్రత్యర్థులను తన పోరాట పటిమతో ముచ్చటెమటలు పట్టించిన ధీరుడు. శత్రువు బలమైన వాడైతే, తెలివితో యుద్దం చేస్తాడు. శత్రువుని ప్రత్యక్షంగా ఎదుర్కోగలనని అనిపించినప్పుడు మాత్రమే ప్రత్యక్ష యుద్ధం చేస్తాడు. యుద్ధ తంత్రాన్ని ఎంతో గొప్పగా ఉపయోగించాడు శివాజి. శివాజీ పరాక్రమాలను తెలుసుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ముందు జాగ్రత్తగా అపారమైన సైనికశక్తిని కొల్హాపూర్‌లో మొహరిస్తాడు. ఈ యుద్ధంలో అతిఎక్కువమంది సైనికులను కోల్పోయిన శివాజీ ఓటమిని అంగీకరించిన పూణే వదిలి వెళ్లిపోతాడు.
అయితే మారువేషంలో వచ్చిన శివాజీ తిరిగి తన కోటను స్వాధీనం చేసుకుంటాడు. తర్వాత సూరత్ నగరంపై దాడి చేసి అపారమైన ధనాన్ని, ఆయుధాలను దోచుకుని తన సైన్యాన్ని బలోపేతం చేసుకుని క్రమంగా మొఘలులు, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటాడు. అయితే ఔరంగజేబు తన పుట్టినరోజు సందర్భంగా శివాజీని , అతని ఆరేళ్ల కొడుకు శంభాజీని ఆహ్వానించి అతిథిగృహంలోనే బందీచేస్తాడు. చాకచాక్యంతో అక్కడినుంచి కొడుకుతో సహా తప్పించున్న శివాజీ రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ 1674 నాటికీ లక్షమంది సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలను, గుఢాచారి వ్యవస్థను, నౌకావ్యవస్థను ఏర్పాటుచేసుకుంటాడు. శ్రీశైలం వచ్చి అక్కడ భవానీదేవిని ధ్యానిస్తాడు. ఆయన భక్తికి మెచ్చిన దేవి ప్రత్యేక్షమై ఖడ్గాన్ని ప్రసాదిస్తుంది.
మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న ఆకాంక్ష, దేవి ఆశీస్సులు ఉన్న ఖడ్గంతో శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నాడు. 1674లో మహారాష్ట్రలోని రాయగఢ్‌ను రాజధానిగా చేసుకొని అక్కడే పట్టాభిషిక్తుడై ఛత్రపతి బిరుదు పొందాడు. కొండకోటను స్వాధీనం చేసుకోవడానికి అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీని పురమాయిస్తాడు శివాజీ. కోట నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశిలించిన తానాజీ యశ్వంతి అనే ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరి, ఆ తాడు సహాయంతో కోటలోకి ప్రవేశించి కోటను స్వాధీనం చేసుకుంటాడు. అయితే ఈ పోరులో తానాజీ మరణిస్తాడు. కోటను గెలిచాం కానీ సింహాన్ని కోల్పోయామని ఆవేదన చెందిన శివాజీ ఆ కోటను సింహఘడ్ గా మార్చాడు.
ఎన్నో కోటలపై దండయాత్రలు చేసిన శివాజీ ఏ మతానికి చెందిన పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. మొగలులకు, సుల్తాన్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన కొలువులో అనేకమంది ముస్లీంలు ఉండేవారు. పరస్త్రీలను మాతృ సమానురాలుగా చూసిన గొప్ప వ్యక్తి శివాజి. 27 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం అనేక యుద్ధాలు చేస్తూ 300 కోటలను తన ఆధీనంలో ఉంచుకుని, లక్షమంది సైన్యాన్ని తయారు చేసిన శివాజీ కొండలపై సాంకేతిక విలువలతో శత్రుదుర్బేధ్యమైన కోటలను నిర్మించడంలో ప్రపంచఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. నాసిక్ నుంచి మద్రాసు వరకు 1200 కిలోమీటర్ల మధ్య 300 కోటలు నిర్మించాడు.
సైనికులు ఒకనాడు సుందరమైన ముస్లిము యువతిని బలవంతంగా తీసుకు వచ్చి శివాజీ ముందు హాజరుపరిచి శివాజీ వారి చర్యని అభినందించి బహుమానం ఇస్తాడనుకున్నారు. అయితే సైనికులను హెచ్చరించిన శివాజీ ఆమె కాళ్ళపై బడి.. తల్లి నా సైనికులు చేసిన పనికి క్షమించు. నా తల్లి కూడా ఇంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకేంత అందంగా పుట్టి ఉండేవాడినో అని.. ఆ ముస్లీం యువతిని సకల రాజలాంఛనాలతో ఆమె ఇంటికి పంపించాడు.
శివాజీ గొప్ప యోధుడేగాక అంతకుమించిన పాలనాధక్షుడు. శివాజీ మహారాష్ట్ర జాతి నిర్మాత. అంతేగాక మధ్యయుగ భారతదేశ చరిత్రలోకెల్లా గొప్ప పరిపాలనాదక్షుడు. ఈనాడు మనం సామ్యవాదం, సోషలిజం, లిబరలిజం, ప్రజాతంత్రం అనే మాటలను పదే పదే వింటుంటాము. శివాజీ పాలనలో ఇవి అన్ని సర్వసమావేశమై ఉండేవి. నేటి భాషలో చెప్పాలంటే గొప్ప సెక్యూలరిస్టు.
మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాతగా పేరొందిన శివాజీ అనారోగ్యంతో – ఏప్రిల్ 3, 1680లో మరణించాడు. శత్రువు బలమైన వాడైతే, తెలివితో యుద్దం చేసాడు. శత్రువుని ప్రత్యక్షంగా ఎదుర్కోగలనని అనిపించినప్పుడు మాత్రమే ప్రత్యక్ష యుద్ధం చేసాడు. యుద్ధ తంత్రాన్ని బహు గొప్పగా ఉపయోగించిన వాడు శివాజి.నిజానికి ప్రపంచ చరిత్రలో ఉన్న రాజులను చూస్తే వారి ముందు శివాజీ బుడతడే…. కాని పరాక్రమంలో, నిష్ఠలో, నిజాయితీలో, వ్యవహారికతలో, నేర్పులో, నిర్భయత్వంలో, సమానత్వంలో ప్రపంచంలో ఉద్భవించిన రాజులలో అందిరిలోకి ఉన్నతమైన వాడు శివాజి.