తెలంగాణ ప్రభుత్వం IAS, IPSల బదిలీలపై కసరత్తు చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో పలువురు IAS, IPS అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఇప్పటికే అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల (CPల)ను బదిలీ చేశారు. హైదరాబాద్ CPగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. సైబరాబాద్ CPగా అవినాష్ మహంతి.. రాచకొండ CPగా సుధీర్‌బాబును ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు సైబరాబాద్ CPగా స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ CPగా ఉన్న DS చౌహాన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. హైదరాబాద్ CPగా ఉన్న సందీప్ శాండిల్యను తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు. వచ్చే ఏడాది మేలో సందీప్ శాండిల్య పదవీ విరమణ చేయనున్నారు.
రాష్ట్రంలో IASగా సేవలందించి కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమ్రపాలికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆమ్రపాలి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆమ్రపాలి తెలంగాణ నుంచి మూడేళ్ల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా బదిలీపై వెళ్లారు. కేంద్ర సర్వీసులో మూడేళ్లు పూర్తికావడంతో ఆమ్రపాలి అక్కడి నుంచి రిలీవై తెలంగాణ సీఎస్‌కు రిపోర్ట్ చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న IAS స్మితా సబర్వాల్ మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చాక దూరంగా ఉంటున్నారు. స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్తారని ప్రచారం జరగుతోంది.