పెట్రోల్ పై కేంద్రం-రాష్ట్రం పన్నులు ఎంతో తెలుసా..దానికంటే వీళ్ల పన్నులే ఎక్కువ

0
సీతాదేవి జన్మస్థలి నేపాల్‌లో కన్నా, రావణుడి లంకలో కన్నా రామ జన్మభూమి ఇండియాలో పెట్రో ధరలు అధికంగా ఉన్నాయి. మనదేశంలో పెట్రో ధరల్లో 60 శాతానికి పైగా పన్ను వాతే ఉంటోంది. పెట్రోల్‌పై అక్షరాలా 32.90 మేర కేంద్రం ఎక్సైజ్‌ పన్ను వేస్తుంటే.. వ్యాట్‌ పేరిట వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 36 శాతం దాకా భారం మోపుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌కు అదనంగా ప్రతి లీటరుపై 2 నుంచి 4 దాకా వసూలు చేస్తున్నాయి. చమురు మూల ధర 32.58 ఉంది. అయితే దీనిపై కేంద్రం విధిస్తున్న ఎక్సెజ్‌ డ్యూటీ..32.90. అంటే.. మూల ధర కన్నా కేంద్ర పన్నే ఎక్కువుంది.
లీటర్‌ పెట్రోల్‌పై హైదరాబాద్‌లో డీలర్‌ మార్జిన్‌ 3.24 రూపాయలు కాగా వీటినీ కలిపితే లీటర్ ధర 68.72 పైసలు అవుతుంది. ఇక ఈ మొత్తంపై రాష్ట్రం విధించే వ్యాట్‌ 35.2 శాతం కలిపితే లీటర్‌ పెట్రోల్‌ ధర 93 దాటేస్తుంది. చమురు ధరలు తగ్గించడానికి కేంద్రం చేయాల్సిందంతా చేసిందని.. ఇక రాష్ట్రాల చేతుల్లోనే ఉందని కేంద్రం అంటోంది. కానీ, వాస్తవమేంటంటే.. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీకి కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆదాయం పంచాల్సిన అవసరం లేని సుంకాలను భారీగా పెంచుకుంటూ పోతోంది. అయితే, కేంద్రం పెంచిన పన్నుల వల్ల వ్యాట్‌ ఆదాయం కూడా పెరిగి రాష్ట్రప్రభుత్వాలు కొంతమేరకు లాభపడుతున్నమాట మాత్రం నిజం.
బెంబేలెత్తిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల దెబ్బకు సామాన్యుడు కుదేలవుతుంటే.. ధరలు రాష్ట్రాలే తగ్గించాలని కేంద్రం, కేంద్రమే తగ్గించాలని రాష్ట్రాలు వాదులాడుకుంటున్నాయి. పెట్రో ధరల బాదుడుకు కారణం ఏ ప్రభుత్వమైనాగానీ..దెబ్బ పడుతున్నది మాత్రం సామాన్యులపైనే. మూల ధరల కన్నా.. పన్నుల భారమే ఎక్కువగా ఉన్న దేశాల్లో మనదేశమే అగ్రస్థానంలో ఉండడం పెట్రోమంటకు ఆజ్యం పోస్తోంది.
ఇక చమురు ధరలు దిగిరావాలంటే..వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌ని వస్తుసేవల పన్ను పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాల ఆదాయం భారీగా పడిపోతుంది. తెలంగాణనే ఉదాహరణగా తీసుకుంటే.. పెట్రోల్‌ మూలధర, కేంద్ర పన్నులు, రవాణా చార్జీలు కలిపితే వచ్చే మొత్తంపై రాష్ట్ర సర్కారు వ్యాట్‌ వసూలు చేస్తోంది. అది దాదాపు 25కు పైగానే ఉంటోంది.
అదే జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. అందులో గరిష్ఠ శ్లాబ్‌ 28 శాతం మాత్రమే. అంటే అది పది రూపాయలలోపే ఉంటుంది. అందులో సగమే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా వస్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో.. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడమంటే వాటిని చావుదెబ్బ కొట్టడమే. అంతేకాదు.. జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ కోసం రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అన్ని రాష్ట్రాలూ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Previous articleఆకర్ష్ టాస్క్‌లో సక్సెస్‌పుల్‌గా దూసుకెళ్తున్న బీజేపీ..కాంగ్రెస్ బేజారు
Next articleకేసీఆర్ నిర్ణయంతో విపక్షాలకు నష్టం..టీఆర్ఎస్ కు లాభం ఎంత..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here