పౌరసత్వ సవరణ చట్టాని (CAA- Citizenship Amendment Act) కి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రలు అట్టుడుకుతున్నాయి. అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవుతుండడంతో పది జిల్లాల్లో ఇంటర్‌నెట్, మొబైల్ సేవలు 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడే కాదు 2018లో వివిధ సందర్భాల్లో 100 సార్లకు పైగా ఇంటర్‌నెట్ సేవలను బంద్ చేశారు.
భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం అనేది చాలా దేశాల్లో జరుగుతోంది. భారత్‌తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్ లోయలో ఇంటర్‌నెట్, ఫోన్ సేవల్ని నిలిపివేశారు.
2016లో హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హన్ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి.
2015లో గుజరాత్‌లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ పటీదార్ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోయాయి.
2016లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్‌నెట్ షట్‌డౌన్ చేశారు.
కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగష్టు 4 నుంచి కశ్మీర్‌లో ఇంటర్‌నెట్, ఫోన్ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్ సేవలు పునరుద్ధరించారు. కానీ 130 రోజులు గడుస్తున్నా ఇంటర్‌నెట్ మాత్రం వాడకంలోకి రాలేదు.
గత నెలలో అయోధ్య తీర్పు సమయంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ బంద్ చేశారు.
ప్రజల భద్రత కోసం ఇంటర్‌నెట్, టెలిఫోన్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, ఆంక్షలు విధించడానికి 2017లో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలో కొన్ని నిబంధనలను చేర్చారు. దీని ప్రకారం కేంద్రహోంశాఖ, హోంశాఖ కార్యదర్శులకు తాత్కాలికంగా ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసే అధికారం ఉంటుంది. అయితే 5 రోజుల తర్వాత తప్పనిసరిగా సమీక్షించాలి.
భారత్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకు కూడా ఇంటర్‌నెట్ సేవల వినియోగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఇంటర్‌నెట్ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది.
ఏ ఏడాదిలో ఎన్నిసార్లు నిలిపివేశారు:
2017లో 79 సార్లు
2018లో 134 సార్లు
2019లో 90 సార్లు
Feedback & Suggestions: newsbuzonline@gmail.com