తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతాను.. అది దేశం అశ్చర్యపోయే విధంగా ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం నియంత్రిత సాగుకు అధిక ప్రాధాన్యమిస్తున్నందున దీనికి తగ్గట్లుగా రైతులకు ఏమైనా అదనపు లబ్ది కల్పించే అవకాశం ఉంటుందా లేక ఇంకేమైనా కొత్త పథకమా అనే అంశంపై అటు రాజకీయ వర్గాల్లో ఇటు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు రైతుబంధు కింద ఎకరాకు ఏటా రూ.10వేలు ఇస్తున్నారు. రూ లక్ష వరకు పంట రుణాల మాఫీ అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మొదటి విడతగా రూ. 25వేలు మాఫీ కూడా చేసింది. రైతులకు బీమా అమలు చేస్తోంది. నియంత్రిత సాగు చేసే రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల పంపిణీ, రైతుబంధు సాయం పెంపు, పంటలకు బోనస్, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పంటల బీమా, పంటలకు మద్దతు ధర ప్రకటన, పండిన పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటి అంశాలపై ఏమైనా నిర్ణయం ఉంటుందా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
గతంలోనూ రైతులకు ఉచిత ఎరువులు, పురుగుల మందుల ఆలోచన ప్రభుత్వం చేస్తుందని ప్రచారం జరిగినా.. రైతుబంధు నేపథ్యంలో అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు సీఎం ప్రకటనతో ఆసక్తికరంగా మారింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com