ఖైరతాబాద్ (Khairatabad) మహా గణపతి (Ganesh) నమూనా విగ్రహాన్ని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఏడాది 63 అడుగుల ‘శ్రీ దశమహా విద్యాగణపతి’గా రూపుదిద్దుకుంటున్నట్లు ప్రకటించారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభమై ఈ ఏడాదితో 69 ఏళ్లు అవుతోంది. ఏటా సిద్ధాంతి విఠలశర్మ సూచనతో నమూనా సిద్ధం చేయడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆయన సూచనల ప్రకారం నామకరణం చేసినట్లు నిర్వాహకులు చెప్పారు.
విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉంటుంది. నిల్చున్న తీరులో శ్రీ దశమహా విద్యాగణపతి విగ్రహం ఉండగా తలపై ఏడు సర్పాలు ఉంటాయి. వెనుక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, వరి ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపున కింద నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ల వద్ద అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహ దేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. మూషికం కూడా ఉండనుంది.
ప్రతి ఏడాదిలాగే ప్రధాన మండపం రెండు వైపులా చిన్న మండపాలు ఏర్పాటు చేసి ఇతర విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. కుడివైపున శ్రీ పంచముఖ లక్ష్మీనారసింహస్వామి, ఎడమవైపున శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకొంటున్నాయి.
సెప్టెంబరు 18న వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 28 వరకు నిర్వహిస్తారు. విగ్రహం తయారీ పనులు 50 శాతానికిపైగా పూర్తయ్యాయని, వినాయక చవితికి మూడు రోజులు ముందుగానే భక్తులు వీక్షించేందుకు అందుబాటులోకి తేనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.