దేశంలో ఈసారి సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంతో పోలిస్తే 94 శాతం వర్షమే పడుతుందని చెప్పి తర్వాత దాన్ని 99 శాతానికి అప్‌డేట్ చేసింది. కానీ IMD ఒకటి చెబితే ఇంకొకటి జరిగింది. వానలు దంచి కొట్టాయి. గత 25 ఏళ్ల రికార్డును తిరగరాశాయి. సాధారణం కన్నా 10శాతం ఎక్కువ పడ్డాయి.
వానల వల్ల 2,100 మంది చనిపోయారు. 46 మంది గల్లంతయ్యారు. 22 రాష్ట్రాల్లో 25 లక్షల మంది ప్రభావితమయ్యారు. అసలు వాతావరణ శాఖ అంచనా ఎందుకు తలకిందులైంది. వాడుతున్న పద్ధతి తప్పా? తీసుకుంటున్న లెక్కలు తప్పా? అంటే IMD వాడుతున్న పద్ధతులు అంత కచ్చితమైన సమాచారం ఇవ్వకపోయినా అంతకుమించిన సమస్య మేఘాలతోనేనని తెలిసింది. అవి కన్ఫ్యూజ్ చేస్తుండటంతోనే అంచనాలు మారిపోతున్నాయని తేలింది.
మామూలుగా మేఘాల వేడి, చల్లదనం, సైజు ఎత్తు బట్టి వాతావరణ అంచనాలు ఉంటాయి. కానీ ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ వల్ల మేఘాలపై ప్రభావం, ప్రస్తుత వాతావరణ మోడల్స్‌కు చిక్కులు తెస్తోంది. మేఘాలపై గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్‌ను సరిగా కనుగొని మోడల్స్‌తో అంచనాలు వేస్తే చాలా వరకు మంచి ఫలితాలొస్తాయని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు.
మేఘాల స్టడీతో పాటు ప్రాంతీయ కంప్యూటర్ సిములేషన్స్‌ను గ్లోబల్ క్లైమేట్ మోడల్స్‌కు జోడించి అంచనాలు వేస్తుంటారని ఓ స్టడీలో తేలింది. దీంతో అంచనాలు తప్పవుతున్నాయని వెల్లడైంది. మేఘాలు ఎలా మారుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయో శాటిలైట్ ఫొటోలతో తెలుసుకుంటున్నా కేవలం వాటిపైనే ఆధారపడి అంచనాలు వేయలేమని సైంటిస్టులు అంటున్నారు.