నరాలు తెగే ఉత్కంఠ..క్షణక్షణం పెరుగుతున్న టెన్షన్.అంతా నిశబ్దం..ఉద్వేగభరితమైన వాతావరణం..కానీ చివరకు మ్యాచ్ టై. ఓ సూపర్ ఓవర్.. అది చాలక బౌండరీల లెక్కింపుతో విన్నర్ ఎంపిక.. వీటిలో ఏదో ఒకటి అప్పుడప్పుడూ జరగడం సాధారణం. కానీ అన్నీ ఒకేసారి ఒకే మ్యాచ్‌లో కనిపిస్తే..అది 2019 ప్రపంచకప్ ఫైనల్ అవుతుంది. క్రికెట్ హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్‌కు నేటితో ఏడాది పూర్తైంది..
ప్రపంచ క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా..భవిష్యత్‌లో ఇలాంటి మ్యాచ్ జరుగుతుందా..అన్న సందేహం కలిగేలా.. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఎక్కడా పట్టు విడవలేదు. ప్రపంచ కప్‌ను ముద్దాడటం కోసం తమ అస్త్ర, శస్త్రాలు అన్నింటిని ఉపయోగించాయి. సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ రావడం..అది కూడా టై అవడంతో.. చివరకు అనూహ్య రీతిలో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిర్ణయించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా..అత్యద్భుమైన మ్యాచ్ చూశామనే భావన మాత్రం అందరిలో ఉంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 241 స్వల్ప స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్‌వోక్స్ 3 వికెట్లు, లియమ్ ప్లంకెట్ 3వికెట్లతో చెలరేగడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం ఇంగ్లాండ్ విజయం నల్లేరుమీద నడకలా అనిపించినా అంత సాఫీగా సాగలేదు. ఆది నుంచీ న్యూజిలాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టుకు లక్ష్యం చిన్నదైనా కొండంతలా పెరిగింది. ఫైనల్ మ్యాచ్ అనే ఒత్తిడి ఆ జట్టులో స్పష్టంగా కనిపించింది. మధ్యలో బెన్‌స్టోక్స్, జాస్‌బట్లర్ ఆదుకోడంతో ఆ జట్టు నిలదొక్కుకుంది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్టోక్స్ ఒంటరిపోరాటం చేశాడు. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన తొలి రెండు బంతులకు పరుగులు రాకపోవడంతో స్టోక్స్ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్లో షాట్ ఆడి రెండు పరుగులు తీశాడు. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఓవర్‌త్రో కారణంగా మరో ఫోర్ రన్స్ అదనంగా వచ్చాయి. ఇక ఇంగ్లాండ్‌కు రెండు బంతుల్లో 3 పరుగులు అవసరమవగా మ్యాచ్ టై అయింది.
దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ ఓవర్ లో ఇంగ్లాండ్ 15 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేయడంతో మ్యాచ్ మళ్లీ డ్రా అయింది. మ్యాచ్ మరోసారి టై అయినా బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌కు అదే తొలి కప్. దాంతో న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపాలైంది.