
పవిత్రమైన కార్తీక మాసంలో పద్మావతి అమ్మవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలు చాలా ముఖ్యమైనవి. అమ్మవారు పూటకో వాహనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అంకురార్పణ క్రతువుతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి.
ధ్వజారోహణం:
బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు ధ్వజారోహణం నిర్వహస్తారు. ధ్వజస్తంభానికి అభిషేకం చేసి, ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తారు. భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణ చేయడంతో ధ్వజారోహణం పూర్తివుతుంది.
చిన్నశేష వాహనం:
ఈ వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు.
పెద్దశేష వాహనం:
లక్ష్మీ సహీతుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా , ఛత్రంగా సమయోచితంగా పెద్దశేషుడు సేవలందిస్తాడు. శ్రీవారి పట్టమహిషి అలివేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను చూసిన వాళ్లకు యోగశక్తి కలుగుతుంది.
హంస వాహనం:
హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే నీరు, పాలు వేరు చేయగలగడం. యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హ్రుదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలవేలుమంగ విహరిస్తూ ఉంటుంది.
ముత్యపుపందిరి వాహనం:
ముద్దులొలికించే ముత్యాలు అలివేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో రాశాడు.
సింహ వాహనం:
సింహం పరాక్రమానికి, శ్రీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన సమయంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవితి పద్మావతి ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది.
కల్పవ్రుక్ష వాహనం:
పాలకడలిని అమ్రతం కోసం మథించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవ్రుక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతావ్రుక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. కల్పవ్రుక్షంపై విహరిస్తున్న అలవేలుమంగ ఆశ్రిత భక్తులకు కష్టాలను తొలగించే పరిపూర్ణ శక్తి.
హనుమంత వాహనం:
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మీ సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని పెళ్లి చేసుకుంది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికే అన్నట్లు అలవేలుమంగ బ్రహ్మోత్సవాల్లో హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుంది.
మోహిని అవతారం:
బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున ఉదయం మోహిని అవతారంలో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తారు.
గజ వాహనం:
గజం ఐశ్వర్య సూచకం. అందుకే ‘ఆగజాంతక ఐశ్వర్యం’ అని ఆర్యోక్తి. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు పెరుగుతాయి.
సర్వభూపాల వాహనం:
సర్వభూపాలురు ఆయా స్థానాల్లో ఉండి అమ్మవారిని సేవిస్తున్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవిస్తారు.
గరుడ వాహనం:
గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు గుర్తుగా భావిస్తారు. శ్రీవారిని, అమ్మవారిని నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా పలు విధాలుగా సేవిస్తున్నారు.
సూర్యప్రభ వాహనం:
సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు, లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్య మండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం ప్రసాదిస్తుంది.
చంద్రప్రభ వాహనం:
క్షీరసాగంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. 16 కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ, శ్రీనివాసులపై దేవతలు పుష్పవ్రుష్టి కురినిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు.
అశ్వవాహనం:
అశ్వం వేంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పద్మావతీ, శ్రీనివాసులు తొలి చూపు వేళ, ప్రణయ వేళ, పరిణయ వేళ సాక్షిగా అశ్వం నిలిచింది.
ధ్వజావరోహణం:
తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ముగుస్తాయి. ఈ సందర్భంగా గజపటాన్ని అవనతం చేసి దేవతలను వారి స్థానాలకు ఘనంగా సాగనంపుతారు.
Feedback & Suggestions : newsbuzonline@gmail.com
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.