రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ్ యాత్ర’ను ప్రారంభించేది ఆ పార్టీ నేతే

0
కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా రెండో యాత్రను మొదలుపెట్టబోతున్నారు. ‘భారత్‌ న్యాయ్ యాత్ర’ పేరుతో మణిపూర్‌ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర జరుగనుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.
జనవరి 14న మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభంకానున్న ఈ యాత్ర 67 రోజుల పాటు కొనసాగి, మార్చి 20వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే ధ్యేయంగా రాహుల్‌ గాంధీ భారత్‌ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు.
‘భారత్‌ న్యాయ్ యాత్ర’ 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. మణిపూర్‌లో ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్రలో ముగియనుంది.

ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంఫాల్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం షెడ్యూల్‌ ఖరారు చేసింది. రెండో విడత యాత్ర చేపట్టాలని రాహుల్‌ గాంధీని కోరుతూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) ఈ నెల 21న ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను 2022 సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 145 రోజులపాటు 4,000 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. ఈ ఏడాది జనవరి 30న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యాత్ర ముగిసింది.
Feedback & Advertisements: newsbuzonline@gmail.com
Previous articleఅంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్.. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ
Next articleకాసేపట్లో హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్.. మాజీ సీఎం‌కు పరామర్శ