బీజేపీకి బిగ్ షాక్.. రాకేష్‌ రెడ్డి రాజీనామా.. కిషన్‌ రెడ్డికి పలు ప్రశ్నలు

0
BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు రాకేష్‌ రెడ్డి. అయితే బీజేపీ రావు పద్మకు టికెట్‌ కేటాయించడంతో రాకేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాసిన నాలుగు పేజీల రాజీనామా లేఖలో రాకేష్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాకేష్ రెడ్డి రాజీనామా లేఖలో పలు అంశాలు:

ప్రతిభ ఆధారంగా అవకాశాలు వస్తాయని చెప్పే మన పార్టీలో కేవలం వ్యక్తులను తృప్తి పరిచే వారికే అవకాశాలు ఇస్తున్నారు. ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న నాకు కనీసం జిల్లా కార్యాలయంలో గడిచిన 3 ఏళ్లలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రజాసేవ చెయ్యాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చిన నాకు కనీసం ప్రజల్లో తిరగడానికి కూడా స్వేచ్చ లేకుండా చేశారు. మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు పిలవకున్నా, సొంత పార్టీ నాయకులే సోషల్ మీడియా వేదికగా నాపై వ్యక్తిగత దుష్ప్రచారం చేసినా ఏనాడూ పార్టీ పట్టించుకోలేదు. కనీసం చర్యలు తీసుకోలేదు. నేను పార్టీకి విధేయుడిగా ఉంటే బానిస లాగా భావించారు.
చివరకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న నాకు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు నోటీసులు నేరుగా మీడియా కు పంపి బద్నాం చేసినా కనీసం చర్యలు తీసుకోలేదు. ఒక రాష్ట్ర అధికార ప్రతినిధికి, జిల్లా అధ్యక్షురాలు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రజలు చర్చించుకున్నారు. కానీ, పార్టీ పట్టించుకోలేదు. పార్టీ కార్యక్రమాలకు పిలుపు లేకుండా కార్యకర్తల సమాచారం ద్వారా వెళితే కనీసం వేదిక మీదకు పిలవకుండా అవమానించారు.
వరంగల్ లో వరదల సందర్బంలో పోలీస్ లు మన కార్యకర్తలను కొట్టినప్పుడు, వారు హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా మీరు రాష్ట్ర అధ్యక్షులుగా జిల్లాలో పర్యటిస్తూ కనీసం వారిని పరామర్శించడానికి రాలేదు. ఆ చర్య ద్వారా పార్టీలో కార్యకర్తలకు రక్షణ లేదన్న భావన కలిగింది. దెబ్బలు తిన్న కార్యకర్తలు కూడా మనోవేదనకు గురయ్యారు.
కేవలం ప్రజాసేవ కోసం వచ్చిన నేను ప్రతికూల పరిస్థితుల్లో వరంగల్ కేంద్రంగా అనేక ఉద్యమాలు, సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. వరదలప్పుడు, కరోనా సమయంలో ఎన్నో సందర్భాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశాలను అందిపుచ్చుకొని ప్రజల్లోకి వెల్లాను. వాళ్ల అభిమానాన్ని, ప్రేమను సంపాదించాను. ఇలా ఒక అర్హత సాధించానని నాకు నేను అనుకున్న తర్వాత వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించడం జరిగింది. కానీ, ఎందరు ఆశించినా ఒకరికే టికెట్ ఇస్తారు. అందరూ కలిసి పార్టీ గెలుపుకు కృషి చేయాల్సి ఉంటుంది. కానీ, టికెట్ నిరాకరించినప్పటికీ నాతో కనీసం మాట్లాడకపోవడం పార్టీ నాయకులు వెలివేసినట్టు చూడటం, జిల్లా, రాష్ట్ర నాయకత్వం నాపట్ల వ్యవహరిస్తున్న తీరు, సొంత పార్టీలోనే పరాయి భావనతో ఉండటం మానసికంగా నన్ను కుంగదీసింది. టికెట్ ఇవ్వని బాధకంటే మిగతా నాయకుల లాగా నాతో మాట్లాడకపోవడం, పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడమే నన్ను ఎక్కువగా బాధించింది.
మొదటి లిస్ట్ పై ఎంతో కసరత్తు చేశామని చెప్పారు. సర్వేల ఆధారంగా టికెట్ లు ఇస్తామన్నారు. కానీ, పార్టీ సర్వేలన్ని నావైపు ఉన్నప్పటికీ, ప్రజల్లో స్పష్టమైన ఆదరణ ఉన్నప్పటికీ, సర్వేలలో సంబంధం లేకుండా రాష్ట్ర నాయకుల అభీష్టం మేరకు టికెట్ లు ఇచ్చారు. అసలు పార్టీలో సర్వేల ఆధారంగా టికెట్ ల కేటాయింపు అనే మాటనే పెద్ద భోగస్. అసలైన సర్వేలను పక్కన పెట్టి కోర్ కమిటీలో ఉన్న నాయకుల గ్రూపుల కారణంగా అనేక మంది ప్రజాదరణ కలిగిన నాయకులను బలిచేసారు.
మొదటి లిస్ట్ విడుదల అయింది. మూడో లిస్ట్ రాబోతుంది. మధ్యలో 2వ లిస్ట్ కూడా వచ్చింది. అక్కడే అసలు రూపం బయట పడింది. వారసత్వ రాజకీయాలు బీజేపీ లో నడవవు అని చెప్తూనే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుని కి మహబూబ్ నగర్ టికెట్ ను ఆగమేగాల మీద ఢిల్లీ నుండి ఒక్కడి కోసం, రెండవ లిస్ట్ ఒక్క పేరుతో విడుదల చేశారు. అసలు ఆయన షాద్ నగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ సిద్ధాంతం తో నడుస్తుందని చెప్తూనే పార్టీలో ఈ చర్య ద్వారా కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు.? మనం ఎంత శ్రమించినా చివరికి డబ్బున్న నేతలు టికెట్ ను ఎగరేసుకపోతారు. అలాంటప్పుడు మిగతా పార్టీలకు మన పార్టీకి తేడా ఏంటి? ఈ పార్టీలో మహిళా కోట ఉంటుంది. కానీ యూత్ కోటా ఉండదా? ఒకవేళ ఉంటే పలుకుబడి కలిగిన, వేలకోట్ల రూపాయలున్న వారసులకే వర్తిస్తుందా? 11 ఏళ్లు కష్టపడి పనిచేసిన నాలాంటి కార్యకర్తకు ఉండదా?
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleహైదరాబాద్‌‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరిగేనా.. HCA ఏం చెప్పింది..?
Next articleరాకేష్‌ రెడ్డి కారు ఎక్కుతారా.. కాంగ్రెస్‌లో చేరుతారా.. ?