భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కరోనా కేసుల సంఖ్యలో రోజురోజుకు కొత్త రికార్డు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 52,123 మంది కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ప్రతి రోజు 45వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు ఒక్క రోజులో 50వేలు దాటడం ఇదే తొలిసారి.ఇక కరోనా బారిన పడి గత 24 గంటల్లో 775 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 15,83,792 లక్షలకు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 34,968కి పెరిగింది. రికవరీ కేసులు కూడా భారీగా ఉండడం కొంత ఊరట కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా రికవరీ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. గురువారం నాటికి 10,20,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 32,553 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 64.44 శాతం, మరణాల రేటు 2.21 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయి.