ఒక్కడే.. పాతాళంలో ఉన్న కాంగ్రెస్ను ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు.. ఒక్కడే.. అవమానాలను, ఆటుపోట్లను ఆయుధంగా చేసుకుని అధికారం అందించాడు. ఒక్కడే.. అధికార పార్టీకి ధీటుగా నిలబడి.. తన పార్టీని గెలుపు వైపు నడిపించాడు. ఒక్కడే.. ప్రజలు తమ చేయితో చేతి గుర్తుకు ఓటేసేలా చేశాడు. ఒక్కడే.. సీనియర్లంతా తమ నియోజకవర్గాలకే పరిమితమైనా.. కాంగ్రెస్ గెలుపుకై రాష్ట్రం మొత్తం తిరిగొచ్చాడు. ఒక్కడే తెలంగాణ వ్యాప్తంగా 83 సభల్లో పాల్గొని… కాంగ్రెస్ అభ్యర్థుల్లో భరోసా నింపి అండగా నిలిచాడు. ఆ ఒక్కడే రేవంత్ రెడ్డి (Revanth Reddy).
అవును రేవంత్ రెడ్డి ఒక్కడే.. కాంగ్రెస్ను అన్నీతానై నడిపించాడు. రాష్ట్రంలో రాదనుకున్న లేదనుకున్న కాంగ్రెస్ పార్టీలో కాంతులు నింపాడు. అంధకారం అలుముకున్నప్పుడు.. నిరాశ, నిస్పృహలు ఆవహించినప్పుడు ఒక వెలుగు అవసరమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఆ వెలుగు కరెక్ట్ టైంలో అందింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాకే పార్టీకి ఊపు వచ్చింది. ఆయన రాక ఆశలు వదులుకున్న కాంగ్రెస్ కార్యకర్తలో ఉరకలెత్తే ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రయాణం అంతా సాఫీగా ఏమి సాగలేదు. ఆయనను అధిష్టానం పీసీసీ చీఫ్గా నియమించినప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డబ్బులు ఇచ్చి టీపీసీసీ చీఫ్ అయ్యారని సొంత పార్టీ నేతలే ఆరోపించారు.
రేవంత్ అవమానాలు, ఆరోపణలకు కుంగలేదు.. లొంగలేదు. అతి తక్కువ కాలంలోనే అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయన టీపీసీసీ చీప్ అయ్యాక హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అప్పుడూ సేమ్.. మళ్లీ సొంత పార్టీ నేతల నుంచే దాడిని ఎదుర్కొన్నారు. రేవంత్ లక్ష్యం ఉపఎన్నికలు కావు. రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకరావడం. అందుకోసం టీపీసీసీ చీఫ్ అయినప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.
ఉపఎన్నికలో ఒడిదుడుకులు ఎదురైన తన లక్ష్యం కోసం శ్రమిస్తూనే ఉన్నారు. ఒక్కో ప్రణాళికను అమలు చేస్తూ మందుకు సాగారు. ముందుగా డిక్షరేషన్లతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పేరు ఉండేలా చూసుకున్నారు. రైతు, యూత్ , బీసీ, మైనార్టీ డిక్షరేషన్లతో వాళ్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పగలిగారు. ఈ సారి అభ్యర్థుల ఎంపికను అధిష్టానం పక్కా వ్యూహం ప్రకారం అమలు చేసింది. పక్కా గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలో నిలిపింది. టికెట్ల కేటాయింపులోనూ రేవంత్‌పై ఆరోపణలు వచ్చాయి. టికెట్లు ఇచ్చేది తాము కాదు హైకమాండ్ అని చెప్పినా ఆ ఆరోపణలు ఆగలేదు.
ఎన్నికల వేళ అధిష్టానం సైతం రేవంత్కు అండగా నిలిచింది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దూసుకెళ్లమంది. దీంతో రేవంత్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. సీనియర్ నేతలంతా వారి వారి నియోజకవర్గాలకే పరిమితమైన రేవంత్ మాత్రం రాష్ట్రం మొత్తం చుట్టొచ్చాడు. రోజుకు మూడు సభలతో ప్రచారాన్ని హెరెత్తించారు. అధికార పార్టీ నుంచి మాటల దాడులు ఎదురైనా.. స్థిరంగా నిలబడ్డాడు. కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరించాడు. చివరకు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించాడు. అలుపెరగని ధీరుడా.. అందుకో జననీరాజనాలు..