జన్వాడ ఫాంహౌస్ విషయంలో అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. GO 111 ఉల్లంఘించారని మంత్రి కేటీఆర్‌కు NGT నోటిసులివ్వడంతో మొదలైన ఈ పంచాయితీ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ నేతలు ఖండిస్తూనే.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. గోపన్‌పల్లిలో దళితుల భూములను రేవంత్ లాక్కున్నారని ఆరోపించారు. ఎదుటివారిపై బురద జల్లడం రేవంత్ రెడ్డికి అలవాటేనని, ఎవరెవరికి 111 జీవో పరిధిలో భూములున్నాయో బయట పెడతామని తెలిపారు. రేపటి నుంచి రేవంత్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని హెచ్చరించారు.
ఫామ్ హౌస్‌పై ఇప్పటికే కేటీఆర్ స్పష్టతనిచ్చారని, కావాలనే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల పట్ల తమకు గౌరవం ఉందని, కేటీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదన్నారు.
టీఆర్ఎస్ నేతల విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ముందుంది మొసళ్ల పండుగ.. రేపు మధ్యాహ్నం 1 గంటకు అని ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ ఫాంహౌస్, టీఆర్ఎస్ కౌంటర్‌పై రేవంత్ రెడ్డి రేపు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
In front crocodile festival tomorrow at 1 pm @ktrtrs @TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) June 7, 2020