ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చి జోరు మీదున్న రష్యా.. మరో ముందడుగు వేసినట్లు తెలిసింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా ప్రారంభించినట్లు సమాచారం. మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పటికే రష్యా ప్రకటించింది.
అయితే రష్యా వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్తలు, వైద్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ కాకుండానే మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు. సరైన ట్రయల్స్ డేటా లేకుండా వ్యాక్సిన్ సేఫ్ అని చెప్పలేమన్నారు CCMB డైరెక్టర్. మన దేశానికి చెందిన వ్యాక్సిన్స్ ట్రయల్స్ డేటా ఆగష్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్ ప్రారంభంలోగానీ వచ్చే అవకాశాలున్నాయన్నారు.
రష్యా వ్యాక్సిన్‌ను పెద్ద సంఖ్యలో ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మన దేశానికి ఉన్నా.. ఆ వ్యాక్సిన్ సేఫ్టీ, సామర్థ్యంపై టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు AIIMS డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. వ్యాక్సిన్ మంచిగా పనిచేస్తుందని తేలినా.. ఆ యాంటీబాడీలు శరీరంలో ఎప్పటి వరకు ఉంటాయన్నది కూడా తెలియాలన్నారు.
రష్యా వ్యాక్సిన్‌పై సేఫ్టీ ట్రయల్స్ చేయాల్సిందేనని WHO తేల్చి చెప్పింది. ఇంకా అన్ని టెస్ట్‌లు చేయలేదని, కాబట్టి సిఫార్సు చేయలేమని చెప్పారు WHO డిప్యూటీ డైరెక్టర్ బార్బోసా. కొవిడ్-19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ను ఆవిష్కరించినట్లు నాలుగు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.