ప్రపంచమంతా కరోనాకి భయపడి మృత్యు ఘడియలు లెక్కిస్తుంటే..ఆమె మాత్రం ధ్వజమెత్తిన ఆడపులిలా గర్జించింది. ఆదివాసి అగ్నికణంలా మారి ఆపన్నులకు అండగా నిలిచింది. భయమనే మాటనే మట్టుబెట్టి మంచితనానికి ప్రతిరూపంగా మారింది. ఆకలికేకలను ఆదుకుంటున్న ఆత్మీయత ఆమె..ఆమె కొమరం భీమ్ పోరాట స్వరం. కొండ కోనలను దాటిన ఆత్మవిశ్వాసం..హేళన, అవహేళనలను పట్టించుకోకుండా అడవిబిడ్డల నవ్వును చూసిన అమ్మతత్వం..ఆమెనే అలుపెరుగని వీరవనిత ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఆపదకాలంలో అడవిబిడ్డల పాలిట ఆమె ఆశాదీపమైంది. ఆదివాసీల ఆకలి తీర్చేందుకు నిత్యం కొండాకోనల్లో పర్యటించింది. గిరిజనుల కష్టాలు తెలిసిన అక్కగా..ఆపన్నులకు అమ్మగా..విపత్కర పరిస్థితుల్లో తన ప్రజల కోసం పరితపించింది ములుగు ఎమ్మెల్యే సీతక్క. గన్‌తో ఉన్నా..గన్‌మెన్‌తో ఉన్నా..అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారామె.
కరోనా మహమ్మారి కష్టజీవుల బతుకులను దుర్భరం చేసిన వేళ…. ఎంతో మందికి పూటగడవటమే కష్టంగా మారింది. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు మరింత దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అడవి బిడ్డల ఆశాదీపంగా..వారి ఆకలితీర్చేందుకు నిరంతరం పరితపిస్తోంది ములుగు ఎమ్మెల్యే సీతక్క. ప్రజల కోసం ఆమె చేసిన కృషి..ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తోంది.
మండుటెండను సైతం లెక్కచేయకుండా కొండలు, కోనల్లో కాలినడకన, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో గిరిజన ప్రాంతాలకు వెళ్తూ..నిత్యావసర సరకులను అందించారు. రాత్రింబవళ్లు గుత్తికోయల గూడాల్లో పర్యటిస్తూ ప్రజల్లో భరోసా నింపారు. రవాణా సౌకర్యం సరిగాలేని గిరిజన ప్రాంతాలకు సరకులను ఎడ్లబండ్లలో, ట్రాక్టర్లలో, అవసరమైతే భుజాల మీద మోస్తూ తీసుకెళ్లి ప్రజలకు అందించారు.
ఆమె నిరాడంబరత, పేదలపై చూపించే ఆప్యాయత ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ రోజుల్లో ప్రజల బాగోగులను పట్టించుకునే ఇలాంటి ప్రజాప్రతినిధి ఉండడం నిజంగా ములుగు ప్రజల అదృష్టంగా చెప్పొచ్చు. సీతక్క అప్పటి పోరాటం పేదల కోసమే..ఇప్పటి పోరాటం పేదల కోసమె..ఆమె ఎప్పుడు ప్రజల కోసమే..అటువంటి వీరవనితకు Newsbuz జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.