సంగీతాన్ని వెత్తుకుంటు స్వరం వెళ్లింది..పాట ఏడుస్తోంది..

0
తీరని దాహంతో సంగీతాన్ని వెత్తుకుంటూ స్వరం వెళ్లిపోయింది. ఆ స్వరాన్నే తలుచుకుంటూ పాట ఏడుస్తోంది..తనను సామాన్య జనానికి చేరువ చేసిన అమృతకంఠం మూగబోయినందుకు విలపిస్తోంది. కొన్ని కోట్ల మందిని దశాబ్దాల పాటు తన గానంతో అలరించిన సంగీత యోధుడు మరణించినందుకు రోదిస్తోంది. మృదుమ‌ధుర‌మైన త‌న స్వ‌రంతో ప్రేక్ష‌కులను ముగ్ధ‌మ‌నోహ‌రుల్ని చేసిన ప్ర‌ఖ్యాత గాయ‌కుడు ఇక లేర‌న్న విష‌యం యావ‌త్ దేశానికి ఓ తీర‌ని విషాదాన్ని మిగిల్చింది.
స‌ర్వ‌ ర‌సాల‌ను త‌న గాత్రంలో వినిపించిన స్వ‌ర‌పిపాసి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని వీడి వెళ్లారు. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార ఆగిపోయింది. తీయ తీయ‌ని రాగాల‌తో  తేన‌లూరించే తెలుగు పాట‌ల‌ను పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు.
తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40వేల పాటలతో అలరించారు బాలు. కానీ ఇంతలోనే మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలే మనకిక శరణ్యం. వి మిస్ యూ బాలూ సార్…ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనే సందేశాలతో సోషల్ మీడియా మారుమోగుతోంది. పలువురు ఆయనకు ఘన నివాళులర్పించారు.
బాలు గాయకుడు మాత్రమే కాదు. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా,సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటుకున్నారు. కమల్ హాసన్ , రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్ రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. కెరీర్ ప్రారంభంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఎక్కువ‌గా పాటలు పాడిన ఆయ‌న త‌ర్వాత దాదాపు 14 భాష‌ల‌లో త‌న గాత్రంతో అల‌రించారు. బాలులో గొప్ప‌ద‌నం ఎంటంటే చాలా మంది నటులకు , వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు.
బాలుకు రికార్డులు కొత్త కాదు. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మభూష‌ణ్‌తో పాటు ఎన్నో అవార్డుల‌ని అందుకున్న బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ఒకేరోజు తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు ఏకబిగిన పాడి స‌రికొత్త రికార్డు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.
Previous articleరిమాండ్ రిపోర్టులో బ‌ట్ట‌బ‌య‌లైన ‌మెద‌క్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ న‌గేష్ బాగోతం..
Next articleప్లేఆఫ్స్‌కు చేరాలంటే ధోనీ సేనకు దారేది.. CSKకు ఉన్నఆప్షన్లేంటి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here