నిప్పులు చిమ్ముతూ ముందడగు వేశాడు. యంగీస్థాన్ లో అగ్గిరాజేశాడు. ఆజాదీ హిందు ఫౌజ్ తో బ్రిటషర్లనీ వణికించాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. పోరాడితే పోయేదేముంది..బానిస సంకెళ్లు తప్ప అన్న లక్ష్యంతో యుద్ధబరిలోకి దూకిన బాస్ బోస్. ఉక్కు పిడుగుల ఉరుమాడు.. నిప్పు కణికలా రగిలాడు..తెల్లవాడికి పట్టపగలే చుక్కలు చూపించాడు
భారత స్వతంత్ర సమరంలో ఎందరో యోధులు.. అందులో సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక ఆయుధం.. స్వతంత్ర సైనిక శక్తిని ఆవిష్కరించి తెల్లవాడిని తరిమికొట్టడానికి ప్రత్యక్ష యుద్ధానికి ఉరికిన యోధుడు. బోస్ కు దూకుడే మంత్రం. రాజీలేని పోరాటమే తంత్రం..నిప్పులు చెరుగుతూ ముందుకు దూసుకెళ్లడమే వ్యూహం..స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది నాయకులున్న బోస్ మాత్రం ప్రత్యేకం.
నా దేశం నాకు ఏమిచ్చింది కాదు..నా దేశానికి నేను ఏమిచ్చాను అనే చిన్న ఆలోచన నేతాజీ జీవితాన్నే మార్చేసింది. కలెక్టర్ గా హాయిగా జీవించాల్సిన అవకాశమొచ్చిన అవన్నీ కాదని..దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని పోరాట బాటలో అడుగులేశాడు. కుతంత్రం పన్నే వాడికి మాటలతో కాదు తూటాలతో సమాధానం చెప్పాలంటూ అడుగులేశాడు సుభాష్ చంద్రబోస్.
సుభాష్ చంద్రబోస్ మాతృభారతి బానిస శృంఖలాలు ఛేదించటానికి 1919 నుంచి 1945 వరకు త్యాగశీల ధీరోదాత్తునిగా స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. సాహస సమరోత్తేజానికి ప్రతీకగా జీవన సర్వస్వాన్ని జాతికి అంకితం చేసి అనూహ్యంగా కనుమరుగైన సుభాష్ చంద్రబోస్‌కు వర్ధంతి లేదు. భారత జన హృదయాలలో ఆయన నిరంతరం సజీవుడే. కేవలం 48 ఏళ్లు జీవించిన సుభాష్ జీవనయానం ప్రపంచ చరిత్రలో అపూర్వ రీతిలో నిక్షిప్తమై అంతర్జాతీయ దీప్తితో కీర్తివంతమైంది.
స్వాతంత్య్ర సాధనకు రాజమార్గం లేదని, స్వేచ్ఛా స్వా తంత్య్రాలను పోరాటం, త్యాగాల ద్వారానే సాధించాలని, యాచన ద్వారా లభించే స్వేచ్ఛకంటే రక్తాన్ని పణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించాలనే జీవితాశయం సుభాష్‌ను రెండో ప్రపంచ సంగ్రామం దిశగా మలుపుతిప్పింది. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వేచ్ఛనిస్తా..’ అన్న ఆయన మాట సమర నినాదం అయింది. రెండో ప్రపంచ సంగ్రామంలో జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో చేతులు కలిపిన సుభాష్ చంద్రబోస్ రాజనీతి స్వతంత్య్ర భారత ఆవిర్భావాన్ని సుగమం చేసింది.
నేతాజీ మరణం రెండు రకాలుగా జరిగే అవకాశం..?
నేతాజీ జీవితం గురించి చాలా వరకూ మనకి తెలిసినా, ఆయన మరణం ఇప్పటికీ వివాదాస్పదమే. ప్రభుత్వం చెబుతున్నట్లు ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదని చాలా మంది నమ్ముతారు. అయితే బోస్ మరణంపై కొందరు చేసిన పరిశోథన ప్రకారం ఆయన మరణం రెండు రకాలుగా జరిగే అవకాశం ఉంది. అందులో మొదటిది విమాన ప్రమాద. రెండోది.. రష్యా నుండి తిరిగి వచ్చి మన దేశం లో భగవాన్ జీ అనే పేరుతో 1985 వరకూ జీవించడం.
రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్ మీద అమెరికా అణుబాంబులతో దాడి చేసిన నేపథ్యంలో, తదుపరి ప్రణాళిక గురించి చర్చించడానికి నేతాజీ సింగపూర్ నుండి జపాన్ బయలు దేరారు. మార్గ మధ్యలో తైవాన్ లో కొంతసేపు ఆగిన బోస్, అక్కడి నుండి మరో విమానంలో జపాన్ బయలుదేరారు. అయితే ఆ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురయ్యింది. నేతాజీ శరీరం ఆ ప్రమాదంలో బాగా కాలిపోయింది. ఆసుపత్రిలో కొంత సమయం చికిత్సపొందిన తరువాత నేతాజీ అక్కడే మరణించారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అయితే మొదటి నుండీ ఈ సిద్ధాంతం మీద అనుమానాలు ఉన్నాయి. చికాగో ట్రిబ్యూన్, అమెరికాకి చెందిన పాత్రికేయుడు, అల్ఫ్రెడ్ వాగ్ నేతాజీ చనిపోయారు అని చెప్తున్న సమయం తరువాత, ఆయనని చూసాను అని చెప్పారు. అగష్టు 30, 1945 లో నెహ్రు ప్రెస్ మీట్ ని మధ్యలో ఆటంకపరచి మరీ ఈ విషయం చెప్పారు. ఈ సంఘటనకి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలని, అన్ని చోట్లా నాశనం చేసేశారు. కేవలం వ్యక్తులు ఇస్తున్న సాక్షం మినహా, నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారని నిరూపించే ఒక్క ఆధారం కూడా లేదు.
రెండోది.. రష్యా నుండి తిరిగి వచ్చి మన దేశంలో భగవాన్ జీ అనే పేరుతో బోస్ 1985 వరకూ జీవించడం. భగవాన్జీయే నేతాజీ అని వదంతలు చాలా కాలంగా ఉన్నాయి. 1955 – 56 లో లుక్నౌ లో మొదటిసారి కనిపించిన భగవాన్జీ మొదటి నుండీ తను ఎవరూ అన్న విషయాన్ని గోప్యంగా ఉంచడానికే ప్రయత్నించారు. అతను చాలా తక్కువ మందిని మాత్రమే కలిసేవారు, వారికి కూడా తన ముఖం ఎప్పుడూ చూపేవారు కాదు. ఈ అంశంపై లోతైన పరిశోధన చేసిన వారు నేతాజీయే భగవాన్జీ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అంటారు.
దీనికి కారణం భగవాన్ జీ, నేతాజీ లు పుట్టిన సంవత్సరం, తేదీ మాత్రమే కాదు సమయం కూడా ఒక్కటే. ఇద్దరి ఎత్తు, శరీర వర్ణం కూడా ఒక్కటే. ఇద్దరూ బెంగాలీలే. ఇద్దరు మాట్లాడేదీ కోల్ కత్తాకి చెందిన బెంగాలి యాసలోనే. భగవాన్జీ చనిపోయాక ఆయన గదిలో నేతాజీ తల్లితండ్రులు ఇతర కుటుంబసభ్యుల ఫొటోలు దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యం పోలికలు. భగవాన్జీని చూసిన ఎవరైనా ఆయన నేతాజీని పోలి ఉన్నారని అనాల్సిందే. 1971 భారత్ –పాకిస్తాన్ యుద్దసమయంలో మన దేశ ఆర్మీ చీఫ్ గా ఉన్న మానెక్షా, ప్రణబ్ ముఖర్జీ, ఇందిరా గాంధీ వంటి ఎందరో ప్రముఖులు ఆయనని కలవడానికి వెళ్లారనే వార్తాలు తరచూ వినిపించేవి. బోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీని తేల్చేందుకు భారత ప్రభుత్వం అనేక కమిటీలను వేసింది. కానీ అవేవీ సత్యాన్ని వెల్లడించలేదు. దీంతో బోస్ మరణం అంతుచిక్కని మిస్టరీలా మారిపోయింది.
ఇప్పటివరకు పుట్టిన తేదీ తప్ప మరణ తేదీ లేని నాయకుడు సుభాష్ చంద్రబోస్ . నేతాజీకి జపాన్ గుడికట్టి పూజిస్తుంటే..మనం మాత్రం పట్టించుకోకుండా వదిలేశాం..ఎవరెన్ని చెప్పినా ఎన్ని ఆధారాలు బయటపెట్టిన ఎప్పటికి మరణం లేని యోధుడు. ఆయన భరత జాతి స్వేచ్చావాయువులు పీలుస్తున్నంత కాలం జాతి జనుల గుండెల్లో ఆయన జీవించి ఉంటారు.
జైహింద్
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.