రేపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్.. పార్టీల పరిస్థితి ఏంటి..?

0
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నామినేషన్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు ప్రకటిస్తారు.
BRS:
ఎన్నికల షెడ్యూల్ రాకముందే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడు కొనసాగిస్తోంది. ఓ వైపు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు టికెట్ దక్కని అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు చేరికలు, నియోజకవర్గాల్లో ప్రచారంపై ఫోకస్ పెట్టారు. షెడ్యూల్ వచ్చాక జనగామ, నర్సాపూర్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ఖరారు చేశారు. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్లను ఫైనల్ చేశారు.
ఇంకా గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆలంపూర్‌ నుంచి ఎమ్మెల్యే అబ్రహం‌ పోటీ చేస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ స్థానిక నేతలు అబ్రహం‌కు టిక్కెట్ ఇవ్వొద్దని.. అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు బీఫామ్ ఇవ్వలేదు. మరి ఆలంపూర్‌ అభ్యర్థిని మారుస్తారా.. లేదా.. అన్నది చూడాలి.
కాంగ్రెస్:
కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. 55 మందితో తొలి జాబితా, 45 మంది అభ్యర్థుల పేర్లతో రెండో లిస్ట్ విడుదల చేశారు. ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే నాలుగు సీట్లను వామపక్షాలకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు ఉంటుందా.. లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. రేపో మాపో కాంగ్రెస్‌ పార్టీ మరో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
BJP:
తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రకటించిన బీజేపీకి మాత్రం వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. బీజేపీ ఇప్పటివరకు 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒక అభ్యర్థి పేరును ప్రకటించింది. ఇవాళ మూడో జాబితాలో 40 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleవాంఖడేలో శ్రీలంకతో భారత్ ఢీ.. మెండిస్‌ సేన ప్యాకప్ పక్కా!
Next articleవన్డే వరల్డ్‌కప్‌లో బిగ్ ఫైట్: కోహ్లీకి గిఫ్ట్ ఇస్తారా.. 2011 రిపీట్ అవుతుందా..?