అసలు ఏ గొడవ లేకపోతే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది.. అన్నట్లు తయారైంది ప్రస్తుతం పరిస్థితి. అది PCC పదవైనా.. కార్పొరేటర్ టికెటైనా.. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఓ రౌండ్ పంచాయితీ అయితేనే దానికి పర్‌ఫెక్ట్ సొల‌్యూషన్ దొరుకుతుందేమో అనేలా రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. తాజాగా PCC పదవిపై జరిగిన రచ్చే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి PCC చీఫ్ పదవి ఇస్తే పార్టీలో ఉండం అంటూ సీనియర్లు హెచ్చరించడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. చివరికి పరిష్కార మార్గం దొరికిందనేలోపే జానారెడ్డి మధ్యలో ఎంట్రీ ఇచ్చి PCC ప్రకటనను వాయిదా వేయించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ పదవికి ఓకే అనడం వెనుక వ్యూహం ఏంటనేది తీవ్రస్థాయిలో అటు అభిమానులతో పాటు ఇటు రాజకీయ నేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
2004 ఎన్నికల సమయంలో వైఎస్ PCC చీఫ్ పదవిలో లేనప్పటికీ.. పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ కూడా పాదయాత్ర చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. PCC చీఫ్ బాధ్యతల్లో ఎవరు ఉన్నప్పటికీ.. సీఎం ఎంపికలో ప్రజామోదం, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కీలకం అవుతాయనే భావనలో రేవంత్ ఉన్నారనిపిస్తోంది. అందుకే PCC చీఫ్ పదవి దక్కినా, దక్కకపోయినా.. ప్రజల్లో ఉంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత బలంగా పోరాడాలనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారనిపిస్తోంది.
రాజస్థాన్ ఎన్నికల సమయంలో PCC చీఫ్‌గా సచిన్ పైలట్ ఉన్నప్పటికీ.. అశోక్ గెహ్లాట్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. కర్ణాటకలోనూ ఇలాగే జరిగింది. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న మోదీ ఎన్నికల తర్వాత ప్రధాని అయ్యారు. తన విషయంలోనూ ఇలాగే జరగొచ్చనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ పదవికి ఓకే అన్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.