శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే భీకర యుద్ధ విమానాలు భారత్‌కు ఎగిరివచ్చాయి. ఒకవైపు డ్రాగన్, మరోవైపు దాయాది దేశం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ కీలక అస్త్రాన్ని అమ్ముల పొదిలోకి చేర్చుకుంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న రాఫెల్ ఫైటర్ జెట్లు భారత్‌లోని అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చేరుకున్నాయి. ఈ ఫైటర్ జెట్లు భారత వైమానిక దళాన్ని పరిపుష్టం చేసి..ఐఏఎఫ్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి.
దశాబ్దాలుగా సరిహద్దుల్లో రావణకాష్టాన్ని రగిలిస్తున్న పాకిస్థాన్‌కు, ఇటీవలి కాలంలో తరచూ కయ్యానికి దిగుతున్న చైనాకూ.. ఏకకాలంలో బుద్ధిచెప్పగల సైనిక సామర్థ్యాన్ని రాఫెల్ ఫైటర్ జెట్‌లతో భారత్ సంతరించుకుంది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధవిమానాల్లో 5 ఫైటర్లు హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు రాఫెల్ రాకతో భారత వాయుసేన సాంకేతికంగా మరో మెట్టు పైకిఎక్కబోతోంది. అటు చైనా, ఇటు పాకిస్తాన్ సైతం కౌంటర్ చేయలేని సమర్థవంతమైనవిగా ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్టులను భద్రతావర్గాలు అభివర్ణిస్తున్నాయి.
రెండు దశాబ్దాలుగా భారత వైమానిక దళం లాంగ్ రేంజ్ విపణులు, సెన్సార్‌లు లేక పాకిస్తాన్ ఎఫ్16 ముందు ఒకింత వెనుకబడింది. పాక్ దగ్గరున్న అమెరికన్ ఎఫ్16 జెట్లను ఎదుర్కోవడానికి రెండు సుఖోయ్ ఎస్‌యూ30ఎంకేఐలు పోరాడాల్సి వచ్చేవి. ఈ పరిస్థితిని రాఫేల్ తిరగరాయనుంది. ఆకాశంలో రెక్కలు చాచుకుని వేటాడే రాఫెల్‌కు కౌంటర్ ఇవ్వాలంటే పాకిస్తాన్ కనీసం రెండు ఎఫ్16 విమానాలు దింపక తప్పదని భద్రతావర్గాలు తెలిపాయి. త్వరలో రష్యా నుంచి వస్తున్న ఎస్400, రాఫెల్ యుద్ధ విమానాలు అన్నీ భారత్‌కు వస్తే భారత వైమానిక దళం గగనతలంలో గాండ్రించవచ్చునని వివరించాయి. రాఫెల్‌ను సవాల్ చేసే బలాలు పాకిస్తాన్ సహా చైనాలోనూ లేవనే అభిప్రాయాలను వ్యక్తం చేశాయి.
ఇక నుండి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి మనం ఆ దేశ భూభాగంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. పొరుగు దేశానికి ఏ మాత్రం అనుమానం రాకుండా మన గగనతలంలోనే ఉండి ముష్కర స్థావరాలపై పిడుగుల వర్షాన్ని మన వాయుసేన కురిపించగలదు. రాఫెల్ యుద్ధ విమానాల రాకతో ఇలాంటి అసాధ్యాలు సుసాధ్యం కానున్నాయి. చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వతమయ ప్రాంతం నుంచి కూడా ఈ జెట్ సునాయాసంగా గాల్లోకి లేస్తుంది. రాఫెల్ విపణులను రెక్కల కింద దాచుకుని శత్రువులను చీల్చి చెండాడుతుంది. మిటియొర్ మిస్సైల్, స్కాల్ప్ మిస్సైల్, మికా మిస్సైల్.. ఈ మూడు ముఖ్యమైన విధ్వంసకర పరికరాలు రాఫెల్‌ను అసమాన భయంకర యుద్ధవిమానంగా నిలబెడుతున్నాయి.
రాఫెల్ అంటే ఫ్రెంచ్ భాషలో గాలి దుమారం అని అర్థం. పేరుకు తగ్గట్టే అది భారత ప్రత్యర్థుల పాలిట గాలి దుమారం కానుంది. ఇప్పటికే ఫ్రాన్స్, ఈజిప్ట్ వంటి దేశాల వద్ద రాఫెల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. అయితే భారత్‌కు వచ్చేవి అత్యంత అధునాతనమైనవి. ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి మరిన్ని వ్యవస్థలను కొనుగోలు చేసి, వీటికి అమర్చడం వల్ల భారత రాఫెల్ శత్రు భీకరంగా రూపొందింది. ముఖ్యంగా రాఫెల్ విమానాలే ఎందుకంటే..శత్రువు వద్ద లేని ఆయుధాలను మనం సమకూర్చుకుంటే వాటి గురించి శత్రువుకు అవగాహన తక్కువగా ఉంటుంది. అందువల్ల యుద్ధంలో మనకు కొంత పైచేయి లభిస్తుంది. ఈ కారణంతోనే రాఫెల్ విమానాలను భారత్ ఎంచుకుంది.