‘మున్సిపల్ ఎన్నికల తరువాత టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటా’ ఇది హుజూర్నగర్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్. దీంతో టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఉత్తమ్ చేసిన ప్రకటనతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై హస్తం నేతల్లో చర్చ మొదలైంది. అటు అసెంబ్లీ ఇటు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవ్వడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తప్పుకోవాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తానే స్వయంగా చేసిన ప్రకటనతో కొత్త చీఫ్ ఎవరనేది ఆసక్తిని రేపుతోంది.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు చాలా మంది హస్తం నేతలు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం వినిపిస్తున్న వారి పేర్లలో సీనియర్ నేతలు అందరూ ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు రేసులో ముందు వరసలో వినిపిస్తున్నాయి. కాగా, టీపీసీసీ ముఖ్య నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.
మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అందరికంటే ముందున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొనే నేతగా.. యూత్ లీడర్‌గా మంచి క్రేజ్ ఉండటంతో ఆయనకు ఛాన్స్ ఇస్తారనే చర్చ సాగుతోంది. అయితే రేవంత్ అభ్యర్థిత్వానికి అధిష్టానం నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా కొందరు స్థానిక నేతలు మాత్రం అడ్డు తగులుతున్నారని తెలిసింది. ఇక, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా టీపీసీసీ చీఫ్ రేసులో ముందు వరసలోనే ఉన్నారు. ఆయన కోసం కొందరు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని, మద్దతుగా లేఖలు కూడా ఇచ్చారని చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. రాహుల్ బాధ్యతలు తీసుకున్న తర్వాతే దేశవ్యాప్తంగా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌లను మార్చుతారని తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఇంఛార్జ్ కుంతియాను కూడా మారుస్తారని.. కొత్త నేత వచ్చిన అనంతరం టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. అయితే అధిష్టానం ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తుంది.. సామాజిక అంశాలు పరిగణలోకి తీసుకుంటుందా.. పాపులారిటీ ఆధారంగా పదవి ఇస్తారా అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com