వన్డే వరల్డ్ కప్ (World Cup)లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. అయితే, బీసీసీఐతో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ చేసుకున్న ఒప్పందం ఈ వన్డే వరల్డ్‌కప్‌తోనే ముగియనుంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందున బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను మరికొన్నాళ్లు కొనసాగిస్తుందా.. లేదా..? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
వన్డే వరల్డ్‌కప్ ముగిశాక భారత జట్టు ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. నవంబరు 23 నుంచి జరిగే ఈ సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
ద్రవిడ్ స్థానంలో పూర్తిస్థాయి కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే BCCI మరోసారి ద్రవిడ్ వైపు మొగ్గు చూపితే నిబంధనల ప్రకారం అతడిని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది. అయితే నిరంతర పర్యటనలు, పని ఒత్తిడి అధికంగా ఉండే ఈ బాధ్యతలను 51 ఏళ్ల ద్రవిడ్ ఆసక్తి చూపుతాడా అన్నది చూడాలి.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. మరోసారి ఏదైనా ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.